: ఎందరో మహానుభావులు... అందరికీ 'యోగా'భివందనాలు!: మోదీ
యోగా ఆచరించి ప్రపంచ ఖ్యాతిగాంచిన ఎందరో మహానుభావులు వున్నారని, అందరికీ వందనాలని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని రాజ్ పథ్ లో ఆయన మాట్లాడుతూ, రాజ్ పథ్ కూడా యోగ పథ్ అవుతుందని ఎవరైనా భావించారా? అని ప్రశ్నించారు. అజ్ఞానంతో కొన్నిసార్లు మానసిక ఆందోళనకు గురవుతుంటామని ఆయన చెప్పారు. ఇది ప్రపంచం ఆరంభం నుంచి జరుగుతోందని, దీనికి పరిష్కారంగా పురాతన భారతదేశంలో రుషులు, మునులు, తపఃసంపన్నులు యోగాను కనిపెట్టారని ఆయన వెల్లడించారు. సాంకేతికత ముందంజ వేయడంలో అంతర్గత శక్తుల వినియోగంలో యోగా సాధన ఎంతో ఉపయోగపడిందని ఆయన వెల్లడించారు. శరీరాన్ని సరైన దిశలో నడిపించడానికి యోగా ఎంతో సహకరిస్తుందని ఆయన తెలిపారు. యోగాసనాలు ఆచరించడం అనేది యోగాలో అతి చిన్న ప్రక్రియ అని, యోగాను సంపూర్ణంగా ఆచరిస్తే ఉన్నత స్థాయిని పొందుతారని ఆయన అన్నారు. 192 దేశాల్లో యోగా ఆచరించే వారందరికీ శుభాకాంక్షలు అని ఆయన చెప్పారు. అనంతరం ఆయన యోగాసనాలు ఆచరించారు.