: నాలుగేళ్లుగా జయలలిత స్థానంలో కరుణానిధి... నాలుక కరుచుకున్న తమిళనాడు విద్యాశాఖ
పదకొండో తరగతి టెక్స్ట్ పుస్తకాల్లో తమిళనాడు ముఖ్యమంత్రి స్థానంలో అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత పేరు కాకుండా డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి పేరు ఉండటంతో విద్యాశాఖ నాలుక కరుచుకుంది. వెంటనే తప్పుగా ఉన్న 3.20 లక్షల పుస్తకాలను వెనక్కి తెప్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందులో రెండున్నర లక్షల ఎకనామిక్స్ టెక్స్ట్స్ బుక్స్ ఉండగా, 70 వేల హిస్టరీ బుక్స్ ఉన్నాయి. అయితే, ఇది ప్రింటింగ్ ప్రాబ్లం కాదని, పుస్తకంలోని 'ముందుమాట'లో 2011 నుంచి ఇలాగే ఉందని అధికారులు చెప్పారు. ఇంతకాలమైనా ఈ పొరపాటును ఎవరూ గ్రహించకపోవడం గమనార్హం. 2011లో ముఖ్యమంత్రి పీఠాన్ని జయ అధిరోహించిన సంగతి తెలిసిందే. అక్రమాస్తుల కేసులో తీర్పు నేపథ్యంలో ఇటీవల ముఖ్యమంత్రి పదవికి కొన్నాళ్లు దూరమైనప్పటికీ... ఆ తర్వాత కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడంతో జయ మళ్లీ సీఎం అయ్యారు. నాలుగేళ్ల నుంచి అమ్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ, ఆమె స్థానంలో కరుణానిధి ఉండటం చర్చనీయాంశం అయింది.