: చంద్రబాబు తప్పుడు దారులు తొక్కుకున్నారు... టీఎస్ మంత్రి పోచారం ధ్వజం


పూర్వరంగంలో టీడీపీలో కీలక నేతగా వెలుగొంది ప్రస్తుతం టీఆర్ఎస్ లో చేరి కేసీఆర్ మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్న పోచారం శ్రీనివాసరెడ్డి ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు తప్పుడు దారులు తొక్కుతున్నారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘టీ న్యూస్’కు ఏపీ పోలీసుల నోటీసుల జారీపై కొద్దిసేపటి క్రితం స్పందించిన పోచారం, చంద్రబాబు సర్కారుపై ఫైరయ్యారు. ఓటుకు నోటు కేసులో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన చంద్రబాబుకు ఏం చేయాలో అర్థం కావటం లేదని ఆయన ఆరోపించారు. అన్నిదారులు మూసుకుపోయిన నేపథ్యంలోనే చంద్రబాబు ‘టీ న్యూస్’కు నోటీసులిప్పించారన్నారు. నోటీసుల జారీతో చంద్రబాబు తప్పుడు దారి తొక్కుతున్నారని స్పష్టమవుతోందని ఆయన ఆరోపించారు. తన ఫోన్ ను ట్యాపింగ్ చేశారని ఆరోపిస్తున్న చంద్రబాబు, ఆధారాలుంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. చట్టం దృష్టిలో అందరూ ఒకటేనన్న విషయాన్ని చంద్రబాబు విస్మరించినట్లున్నారని పోచారం వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News