: ‘టీ న్యూస్’కు ఏపీ పోలీస్ నోటీసు సారాంశమిదే!
నిన్న రాత్రి ఏపీ పోలీసులు ‘టీ న్యూస్’ ఛానెల్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. సదరు నోటీసులో ఏపీ పోలీసులు పలు అంశాలను ప్రస్తావించారు. నోటీసులకు మూడు రోొజుల్లోగా వివరణ ఇవ్వాలని పేర్కొన్న పోలీసులు ప్రస్తావించిన అంశాలిలా ఉన్నాయి. ‘‘కేబుల్ టీవీ నెట్ వర్క్ నియంత్రణ చట్టం-1995లోని సెక్షన్ 19 మేరకు ఈ నోటీసు జారీ చేస్తున్నాం. టీ న్యూస్ పేరిట మీరు నడుపుతున్న ఛానెల్ ఏపీ, తెలంగాణల్లోని కేబుల్ టెలివిజన్ నెట్ వర్క్ నిబంధనల పరిధిలోకి వస్తుంది. సంబంధిత చట్టంలోని ప్రోగ్రామ్ కోడ్ కు అనుగుణంగా కార్యక్రమాలు ఉండాలి. కానీ, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తెలంగాణకు చెందిన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో మాట్లాడినట్లుగా ఈ నెల 7 వ తేదీ రాత్రి 8.30 గంటల సమయంలో మీరు ఒక వార్త ప్రసారం చేశారు. మీరు ప్రసారం చేసిన కథనంలోని అంశం ఏపీతో పాటు తెలంగాణలోని ప్రజల్లో సామరస్యాన్ని దెబ్బతీసేలా ఉంది. దీని ద్వారా రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలు, రాజకీయ పార్టీల మధ్య శత్రుభావం, విద్వేషాలను రేకెత్తించారు. ఏపీ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ అధిపతి ప్రతిష్ఠను దెబ్బతీస్తూ పదేపదే ఆ దృశ్యాలను ప్రసారం చేశారు. అది కేబుల్ టీవీ చట్టంలోని ప్రోగ్రామ్ కోడ్ కు భిన్నంగా వ్యవహరించడమే కాక పరువు నష్టం కలిగించేలా, తప్పుడు, అసత్యంతో కూడిన కథనాన్ని ఉద్దేశపూర్వకంగానే ప్రసారం చేశారు. దీనికి సంబంధించి తగిన చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదో 3 రోజుల్లోగా వివరణ ఇవ్వగలరు’’ అని ఆ నోటీసుల్లో ఏపీ పోలీసులు టీ న్యూస్ ఛానెల్ ను వివరణ కోరారు.