: ప్రతీకారం తీర్చుకోడానికే ప్రణబ్ నాపై ఈడీ దర్యాప్తుకు ఆదేశించారు: లలిత్ మోదీ
కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ తనకు సాయం చేశారన్న వివాదం నడుస్తుండగానే ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ... యూపీఏ-2 హయాంలో ఆర్థికమంత్రిగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీపై ఆరోపణలు చేశారు. ఐపీఎల్ కు సంబంధించి తన ప్రమేయంపైన, తన వ్యక్తిగత ఆర్థిక లావాదేవీలపైన 2010లో ప్రణబ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేశారని చెప్పాడు. అయితే కేంద్ర మంత్రి అయిన శశిథరూర్ కు ఐపీఎల్ కొచ్చి ఫ్రాంఛైజీలో పాత్రపై తెలుసుకునేందుకుగాను నాటి ప్రభుత్వం తనపై విచారణకు ఆదేశించినట్టు లలిత్ భావిస్తున్నాడని ఆంగ్ల పత్రిక 'ద టైమ్స్ ఆఫ్ ఇండియా' తాజాగా ప్రచురించిన ఓ డాక్యుమెంటులో వెల్లడించింది. ఒక విదేశీ వ్యాపార ప్రతినిధిగా లండన్ లో ఉండేందుకుగానూ యూకే అధికారుల అనుమతికోసం ఇచ్చిన 46 పేజీల స్టేట్మెంట్ లో ప్రస్తుత రాష్ట్రపతి అయిన ప్రణబ్ కు వ్యతిరేకంగా లలిత్ ఈ ఆరోపణలు చేసినట్టు టైమ్స్ రాసుకొచ్చింది. ఇదిలాఉంటే దర్యాప్తుకు ఆదేశించిన కొన్నిరోజులకు థరూర్ ను పదవినుంచి తొలగించారు. మరోవైపు లలిత్ కూడా భారత్ వదిలి లండన్ వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.