: మార్కెట్ నుంచి వెనక్కుతెచ్చిన నూడుల్స్ ను ఇంధనంగా వాడుతున్న నెస్లే
విషపూరితాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో బహిరంగ మార్కెట్ నుంచి వెనక్కు తెప్పించిన మ్యాగీ నూడుల్స్ ప్యాకెట్లను నెస్లే సంస్థ వినూత్న రీతిలో వినియోగిస్తోంది. ఈ ప్యాకెట్లలోని సరుకును సిమెంట్ కర్మాగారాల్లో ప్రత్యామ్నాయ ఇంధనంగా వాడేందుకు నెస్లే పంపుతోంది. మ్యాగీని చిన్న చిన్న ముక్కలుగా చేసి, ఊక, పొట్టు వంటి వ్యర్థాలతో కలిపి బాయిలర్ లో వేసి మంట పెడుతున్నట్టు కర్ణాటకలోని ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ అధికారి ఆర్.ఎస్. బిరాదర్ తెలిపారు. ఐదు సిమెంట్ ఫ్యాక్టరీల్లో మ్యాగీ నూడుల్స్ ను ఇంధనంగా వాడుతున్నారని కన్నడనాట టీవీ చానల్స్ వార్తలను ప్రసారం చేశాయి. ఇంధనంగా వాడేందుకు వీలున్న ప్రొడక్టును ఇంతకాలం ఆహార పదార్థంగా విక్రయించడంపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.