: సెటిలర్ల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోంది: గవర్నర్ కు ఫిర్యాదు చేసిన దానం
హైదరాబాదులోని సెటిలర్ల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని... దీని ద్వారా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మెజార్టీ వచ్చేలా వార్డుల విభజన జరుగుతోందని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత దానం నాగేందర్ ఆరోపించారు. కాసేపటి క్రితం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కాంగ్రెస్ నేతలతో కలసి ఆయన గవర్నర్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ పై ఫిర్యాదు చేశారు. గవర్నర్ తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ, సోమేష్ పై నిప్పులు చెరిగారు. జీహెచ్ఎంసీలోని వార్డులను అసంబద్ధంగా విభజించారని అన్నారు. వార్డుల పునర్విభజనలో టీఆర్ఎస్ నేతలు చెబుతున్నట్టుగానే కమిషనర్ చేస్తున్నారని... అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకోవాల్సి ఉన్నా, పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కమిషనర్ ను తొలగించాకే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేకపోతే హైదరాబాద్ ను స్తంభింపజేస్తామని... అవసరమైతే కోర్టుకు కూడా వెళతామని హెచ్చరించారు.