: స్టార్టప్ లతో పోటీ పడలేక ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ ఇబ్బందులు!
ఆ కంపెనీలు భారత ఐటీ చరిత్రను తిరగరాశాయి. దేశ విదేశాల్లో సత్తా చాటాయి. కొద్ది సంవత్సరాల క్రితం వరకూ ఆ కంపెనీల చుట్టూ క్లయింట్లు క్యూ కట్టారు. క్లయింట్ సేవల విషయంలోనూ ఈ కంపెనీలు పనితీరును మెరుగుపరచుకుంటూనే వచ్చాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న స్టార్టప్ కంపెనీలు అతి తక్కువ ధరకు ఐటీ సేవలందిస్తూ, దిగ్గజాలకు సవాల్ విసురుతున్నాయి. దీంతో 1990 నుంచి 2000 వరకూ ఐటీ బూమ్ లో ఓ వెలుగు వెలిగిన ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ తదితర భారత ఐటీ కంపెనీలు, ఇప్పుడు ఆ స్థాయి ప్రభను చూపలేకపోతున్నాయి. 2011-12 నుంచి ఈ కంపెనీల ఆదాయ వృద్ధి తగ్గిపోతూ వస్తోంది. ఐటీ రంగంలో పోటీ పెరగడమే ఇందుకు కారణం. క్లయింట్లకు మరింత వేగంగా, తక్కువ ధరలకు సర్వీస్ అందించేందుకు స్టార్టప్ లు సిద్ధంగా ఉంటున్నాయి. ఐటీ సేవలను పొందుతున్న టెలికం, రిటైల్, బ్యాంకింగ్ సంస్థలు సైతం పదుల సంఖ్యలో క్లయింట్లను నిర్వహిస్తున్న దిగ్గజాల కంటే, ఓ మోస్తరు స్టార్టప్ మరింత సమర్థవంతమైన సేవలందిస్తాయని నమ్ముతున్నాయి. దీంతో 147 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 9.40 లక్షల కోట్లు)కు విస్తరించిన భారత ఐటీ ఇండస్ట్రీలో స్టార్టప్ సంస్థల వాటా శరవేగంగా విస్తరిస్తోంది. సమస్యలను అధిగమించి తిరిగి ఓ వెలుగు వెలిగేందుకు విప్రో, ఇన్ఫీ కంపెనీలు కొత్త ప్లాన్లు వేస్తున్నాయి. అందులో భాగంగా విప్రో 'కమాండ్ ఫోర్స్' పేరిట కొత్త విభాగాన్ని ఏర్పాటు చేసింది. వీటిల్లో తక్కువ మంది సభ్యులుంటారు. క్లయింట్ నుంచి ఏదైనా ఫిర్యాదు వస్తే ఈ టీమ్ తక్షణం స్పందిస్తుంది. కొత్త క్లయింటు చేరినా ఈ టీమ్ వెంటనే వారికి అవసరమయ్యే సాంకేతిక సేవలను అందిస్తుంది. అది మినహా వీరికి మరో పని ఉండదు. ఇన్ఫోసిస్ ఇటీవలే ఉద్యోగులకు మరింత ఫ్లెక్సిబుల్ గా ఉండేలా పలు నిర్ణయాలు తీసుకుంది. పని సమయాల్లో సామాజిక మాధ్యమాలు చూసుకోవచ్చని, డ్రస్ కోడ్ ను పాటించనక్కర్లేదని స్పష్టం చేసింది. క్లయింట్లతో ఎటువంటి సమస్యలు రాకుండా, సేవలందిస్తున్నంత కాలం ఎలాగైనా ఉండవచ్చని తెలపడం గమనార్హం. ఇక టెక్ మహీంద్రాలో మిడ్ లెవల్ ఉద్యోగులకు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకు మధ్య నిత్యమూ క్విజ్ పోటీలు జరుగుతున్నాయి. వీటి ద్వారా మేనేజ్ మెంటు, ఉద్యోగుల మధ్య పని వాతావరణాన్ని తేలికపడుతుందని, తద్వారా పనితీరు మెరుగుపడుతుందని సంస్థ భావిస్తోంది. ఆలోచనలు పంచుకోవచ్చని అంటోంది. ఇలా ఐటీ కంపెనీలు వినూత్న రీతిలో అడుగులు వేస్తూ, స్టార్టప్ ల నుంచి వచ్చే పోటీని తట్టుకు నిలబడాలని భావిస్తూ సాగుతున్నాయి.