: మా పనిలో మేమున్నాం... చట్టం తన పని తాను చేసుకుపోతుంది: కేటీఆర్ వ్యాఖ్య


ఓటుకు నోటు కేసుకు సంబంధించి తెలంగాణ పంచాయితీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ కొద్దిసేపటి క్రితం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో టీడీపీ నేతల తీరును ఎండగడుతూనే, తమకు ఊపిరి సలపని పని ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఢిల్లీ పర్యటనకు వచ్చిన కేటీఆర్ కొద్దిసేపటి క్రితం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడితో భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వివాదాస్పద అంశాలపై నిత్యం మాట్లాడేంత తీరిక తమకు లేదని ప్రకటించారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సి ఉందని, ఆ పనిలోనే తామంతా నిమగ్నమై ఉన్నామని ఆయన తెలిపారు. ఓటుకు నోటు కేసుపై మీడియా పలుమార్లు సంధించిన ప్రశ్నలకు స్పందించిన ఆయన... 'మా పనిలో మేమున్నాం, చట్టం తన పని తాను చేసుకుపోతుంది' అని వ్యాఖ్యానించారు. తప్పు చేపిన టీడీపీ నేతలు ఆ బురదను మిగిలిన వారికి అంటించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. వెంకయ్యతో భేటీలో భాగంగా మెదక్ జిల్లా సిద్దిపేటకు క్లాస్-1 హోదాపై హామీ లభించిందని ఆయన ప్రకటించారు.

  • Loading...

More Telugu News