: టెయిల్ పాండ్ వద్ద ఏపీ బలగాలు... సాగర్ వద్ద మరోమారు ఉద్రిక్తత
నాగార్జున సాగర్ ప్రాజెక్టులో అంతర్భాగమైన టెయిల్ పాండ్ తెలుగు రాష్ట్రాల మధ్య మరో వివాదానికి తెర లేపింది. ప్రాజెక్టులో అంతర్భాగమే అయినప్పటికీ టెయిల్ పాండ్ మొత్తం ఏపీ పరిధిలోనే ఉంది. దీంతో టెయిల్ పాండ్ ఏపీకి చెందినదిగానే నిన్నటిదాకా అంతా భావించారు. అయితే ప్రాజెక్టు తమదైనప్పుడు, టెయిల్ పాండ్ కూడా తమకే దక్కాలంటూ తెలంగాణ కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. టెయిల్ పాండ్ ను స్వాధీనం చేయాలని ఏపీ సర్కారుకు లేఖ కూడా రాసింది. టెయిల్ పాండ్ ను తాము స్వాధీనం చేసుకున్నా, అందులో ఉత్పత్తి అయ్యే విద్యుత్ ను ఏపీకే ఇస్తామంటూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ లేఖపై ఏపీ సర్కారు ఇప్పటిదాకా స్పందించలేదు. ఈ నేపథ్యంలో టెయిల్ పాండ్ ను స్వాధీనం చేసుకునేందుకు తెలంగాణ పోలీసులు వస్తారన్న సమాచారంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. గుంటూరు జిల్లా గురజాల ఆర్డీఓ మురళి ఆదేశాలతో రెంటచింతల ఎమ్మార్వో రాములు నాయక్ 200 మంది పోలీసు బలగాలతో నిన్న రాత్రి టెయిల్ పాండ్ చేరుకున్నారు. రాత్రంతా అక్కడే ఉండి పరిస్థితి సమీక్షించాలన్న ఆర్డీఓ ఆదేశాలతో రాములు నాయక్ పోలీసు బలగాలతో అక్కడే బస చేశారు. ఇక దీనిపై నేడు తెలంగాణ ప్రభుత్వం స్పందించనుందని సమాచారం. ఈ నేపథ్యంలో మరోమారు సాగర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు తప్పవన్న వాదన వినిపిస్తోంది.