: ఏపీ ఎమ్మెల్సీగా సోమిరెడ్డి ప్రమాణం... మరో ముగ్గురు టీడీపీ నేతలు కూడా
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ కోటా కింద ఎంపికైన సోమిరెడ్డి చేత కొద్దిసేపటి క్రితం మండలి చైర్మన్ చక్రపాణి ప్రమాణం చేయించారు. నేటి ఉదయం ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లి దివంగత నందమూరి తారకరామారావుకు నివాళులర్పించిన సోమిరెడ్డి నేరుగా శాసనమండలికి చేరుకుని ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన సోమిరెడ్డి పార్టీలో కీలక నేతగా ఎదిగారు. పార్టీపై విపక్షాల విమర్శలను తిప్పికొట్టడంతో పాటు వైరివర్గాలపై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడటంలో ఆయన తనదైన శైలిలో రాణిస్తున్నారు. ఇదిలా ఉంటే, సోమిరెడ్డితో పాటు పార్టీ నుంచి గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా ఎంపికైన టీడీ జనార్దన్, బీద రవిచంద్రయాదవ్, గౌనివారి శ్రీనివాసులు కూడా ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు.