: మైక్రోసాఫ్ట్ లో ప్రకంపనలు... సత్య నాదెళ్ల వ్యవహారాలు నచ్చక నలుగురు ఉన్నతోద్యోగులు రాజీనామా!
ప్రపంచ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ లో సీనియర్ ఉద్యోగులు రాజీనామాలు చేయడం కలకలం సృష్టించింది. ఒకరూ ఇద్దరూ కాదు, ఏకంగా నలుగురు ఉన్నతోద్యోగులు రాజీనామాలు చేశారని తెలుస్తోంది. ఈ విషయాన్ని సంస్థ చీఫ్ సత్య నాదెళ్ల స్వయంగా ఉద్యోగులకు ఈ-మెయిల్ ద్వారా తెలియజేయడం మరింత ప్రకంపనలు సృష్టిస్తోంది. సంస్థ ఇంజనీరింగ్ విభాగాన్ని మూడు గ్రూపులుగా చేయాలని తాను తీసుకున్న నిర్ణయాన్ని ముగ్గురు వ్యతిరేకించారని నాదెళ్ల తెలిపారు. నోకియాలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా ఉంటూ, ఆ పదవికి రాజీనామా చేసి మైక్రోసాఫ్ట్ లో ప్రస్తుతం డివైజస్ గ్రూప్ ను పర్యవేక్షిస్తున్న స్టీఫెన్ ఈలోప్, అడ్వాన్డ్స్ టెక్నాలజీ హెడ్ ఎరిక్ రూడర్, బిజినెస్ సొల్యూషన్స్ విభాగం చీఫ్ కిరిల్ తతారినోవ్ లు సంస్థను వీడారని సత్య నాదెళ్ల తెలిపారు. కస్టమర్లకు మరింత సమర్థవంతమైన సేవలందించేందుకు తానీ నిర్ణయం తీసుకున్నానని ఆయన తెలిపారు. మైక్రోసాఫ్ట్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ పెన్ సైతం చాలా కాలం క్రితమే సంస్థకు రాజీనామా చేస్తానని తనకు తెలియజేసినట్టు నాదెళ్ల పేర్కొన్నారు. సంస్థలో ఉద్యోగుల మధ్య ఈ రాజీనామాల విషయం తీవ్ర చర్చకు తెరలేపింది.