: విజయవాడ మెట్రో రైలు ప్రాజక్టును మూడేళ్లలో పూర్తి చేయాలని నిర్ణయించాం: మంత్రి పల్లె
విజయవాడ మెట్రో రైలు ప్రాజక్టును మూడు సంవత్సరాలలో పూర్తి చేయాలని నిర్ణయించినట్టు మంత్రివర్గ సమావేశం అనంతరం ఏపీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి తెలిపారు. మెట్రో ప్రాజెక్టును రూ.6,823 కోట్లతో 2019 కల్లా పూర్తి చేయనున్నామని చెప్పారు. మొత్తం రెండు కారిడార్లు, 25 స్టేషన్లు ఉంటాయని, రాజధాని అమరావతికి మెట్రో రైలు లింక్ ఉంటుందని అన్నారు. మొదటి కారిడార్ లో 12 స్టేషన్లు ఉంటాయని, పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పెనమలూరు వరకు కారిడార్ 1 ఉంటుందని పేర్కొన్నారు. ఇక రెండో కారిడార్ లో 13 స్టేషన్లు ఉంటాయన్నారు. దానంతటికీ మొత్తం 31.20 హెక్టార్ల ప్రభుత్వ భూమి అవసరం అవుతుందని పల్లె వెల్లడించారు. మెట్రో ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా రూ.866 కోట్లు అని చెప్పుకొచ్చారు. గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలకు పూర్తి వ్యాట్ మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. 250 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అవకాశం ఉంటుందని, దానివల్ల యూనిట్ ధర రూ.4.70కు వస్తుందని చెప్పారు. ఇక చెట్టు-నీరు కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు.