: స్పిన్ ద్వయంపై ధోనీ ప్రశంసలు


గత నాలుగేళ్లుగా ధోనీ ఇద్దరు స్పిన్నర్లపై ప్రధానంగా ఆధారపడ్డాడు. ఆ స్పిన్ ద్వయంలో ఒకరు ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కాగా, మరొకరు లెఫ్టార్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా. బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ కోసం టీమిండియాతో కలిసిన ధోనీ... మిర్పూర్ లో మీడియాతో మాట్లాడాడు. తొలుత అశ్విన్ గురించి చెబుతూ... అతనెంతో మెరుగయ్యాడని తెలిపాడు. భిన్న పరిస్థితుల నేపథ్యంలో... తన ఆటకు మెరుగులు దిద్దుకోవడం ఓ టెస్టు క్రికెటర్ కు ఎంతో అవసరమని అన్నాడు. అశ్విన్ ఆట గురించి బాగా ఆలోచిస్తాడని, అందుకే బౌలింగ్ ను విశేషంగా మెరుగుపర్చుకోగలిగాడని వివరించాడు. ఇక, రవీంద్ర జడేజా గురించి మాట్లాడుతూ... భుజం గాయం నుంచి కోలుకున్న తర్వాత ఆత్మవిశ్వాసంతో ఉరకలేస్తున్నాడని తెలిపాడు. "ఐపీఎల్ లో చక్కగా రాణించాడు. వరల్డ్ కప్ లోనూ మెరుగైన ఆటతీరు కనబర్చాడనే భావిస్తున్నా. బౌలింగ్ చేసే చేతికి గాయమైన తర్వాత కోలుకుని ఆత్మవిశ్వాసంతో బరిలో దిగడమంటే మామూలు విషయం కాదు" అని పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News