: రాత్రి వేళ విచారణ ఏమిటి?: ఏసీబీ ఆదేశాలను తిరస్కరించిన టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డి
తెలంగాణ ఏసీబీ అధికారులకు నిన్న టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డి సైలెంట్ గానే షాకిచ్చారు. అర్ధరాత్రి, అపరాత్రి అన్న తేడా లేకుండా విచారణకు రమ్మంటే కుదరదని ఆయన సౌమ్యంగానే ఏసీబీ అధికారులకు తేల్చిచెప్పారట. ఓటుకు నోటు కేసులో నిన్న రాత్రి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు నోటీసులు జారీ చేసిన ఏసీబీ అధికారులు ఆ తర్వాత నేరుగా ఆదర్శ నగర్ లోని వేం నరేందర్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. విచారణకు హాజరుకావాలంటూ నరేందర్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. అంతేకాక ‘విచారణకు నడవండి’ అంటూ ఏసీబీ అధికారులు కాస్త దూకుడుగానే వ్యవహరించారు. అయితే తనకు ఆరోగ్యం సరిగా లేదని, అంతేకాక రాత్రి వేళ విచారణ ఏమిటని నరేందర్ రెడ్డి ఎదురు ప్రశ్నించారు. రాత్రి సమయంలో విచారణకు హాజరుకాలేనని కూడా తేల్చిచెప్పారు. దీంతో కాస్త వెనక్కు తగ్గిన ఏసీబీ అధికారులు 'బుధవారం ఉదయం విచారణకు హాజరు కండి' అంటూ చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోయారట. ఇదిలా ఉంటే, నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసే క్రమంలోనే ఉన్నపళంగా విచారణకు హాజరుకావాలని ఏసీబీ అధికారులు ఆయనను కోరి ఉంటారన్న వాదన వినిపిస్తోంది.