: రంగంలోకి కేంద్రం... నేడు హైదరాబాదు రానున్న కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరీ


ఓటుకు నోటు వ్యవహారం కారణంగా తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఈ కేసులో టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి అరెస్ట్ కాగా, నిన్న రాత్రి తెలంగాణ ఏసీబీ మరో ఇద్దరు టీడీపీ నేతలకు నోటీసులు జారీ చేసింది. తాజా నోటీసులు జారీ అయిన వారిలో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో పాటు, మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన వేం నరేందర్ రెడ్డి ఉన్నారు. ఇక ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుకు కూడా ఏ క్షణంలోనైనా నోటీసులు జారీ కానున్నాయన్న ప్రచారం జరుగుతోంది. అయితే తెలంగాణ ప్రభుత్వ చర్యకు అనుగుణంగా ప్రతిచర్యలకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రెండు రాష్ట్రాల వ్యూహ ప్రతివ్యూహాలతో నిన్నటి నుంచి పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం రంగంలోకి దిగక తప్పలేదు. వాస్తవాలను నిగ్గుతేల్చేందుకు ఆ శాఖ జాయింట్ సెక్రటరీ అలోక్ కుమార్ నేడు తన బృందంతో కలిసి హైదరాబాదు రానున్నారు. కేసు పూర్వపరాలపై దృష్టి సారించడంతో పాటు ఇరు రాష్ట్రాలకు చెందిన పోలీసు ఉన్నతాధికారులతో ఆయన భేటీ కానున్నట్లు సమాచారం. అంతేకాక గవర్నర్ సలహాదారులతోనూ ఆయన ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అలోక్ కుమార్ ముందు తమ తమ వాదనలు వినిపించేందుకు ఇరు రాష్ట్రాలకు చెందిన పోలీసు బాసులు సమాయత్తమవుతున్నారు.

  • Loading...

More Telugu News