: అన్నీ తానై... సీఎం అభ్యర్థి లేకుండానే బీహార్ ఎన్నికల ప్రచారానికి మోదీ
త్వరలో జరగనున్న బీహార్ ఎన్నికల్లో మోదీ నేతృత్వంలోని బీజేపీ విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. కాంగ్రెస్, జనతాదళ్ (యు), ఆర్ జేడీ తదితర విపక్షాలన్నీ బీజేపీని నిలువరించే ఏకైక లక్ష్యంతో, నితీష్ కుమార్ సీఎం అభ్యర్థిగా దూసుకుపోతుంటే, బీజేపీ మాత్రం ముఖ్యమంత్రి అభ్యర్థి లేకుండానే, కేవలం మోదీ ఇమేజ్ తో బరిలోకి దిగుతోంది. "ముఖ్యమంత్రి అభ్యర్థిని బీజేపీ ప్రకటించదు. ఆ పోస్టుకు సరితూగగల సత్తా ఉన్నవారు ఎందరో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ పేరు చెప్పుకునే యుద్ధం చేస్తాం" అని ఆ పార్టీ నేత అనంత్ కుమార్ తెలిపారు. ఆయన నాయకత్వంలోనే బీజేపీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. కాగా, త్వరలోనే బీహార్ లో ఎన్నికల ప్రచారానికి బీజేపీ తరపున మోదీ నగారాను మ్రోగించనున్నారు. కాగా, బీజేపీ మోదీ పేరు చెప్పుకొని పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొని ఘోరంగా దెబ్బతిందని నితీష్ విమర్శించారు.