: ‘త్రయం’ సలహాలు అక్కర్లేదు... బీసీసీఐకి తేల్చిచెప్పనున్న రవిశాస్త్రి
కోచ్ అంటేనే... జట్టు సభ్యుల ఆటతీరును మెరుగుపరిచేందుకు సలహాలతో పాటు సూచనలు చేసేవాడు. ఇదే అభిప్రాయంతో టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి ఉన్నట్లున్నాడు. ప్రస్తుతం బంగ్లా పర్యటనలో ఉన్న టీమిండియాకు డైరెక్టర్ గానే కాక తాత్కాలిక కోచ్ గా కూడా వ్యవహరిస్తున్న రవిశాస్త్రి, ఈ పర్యటన ముగియగానే రెగ్యులర్ కోచ్ గా బాధ్యతలు చేపట్టడం ఖాయంగానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన మదిలోని ఓ అభిప్రాయం అటు బీసీసీఐనే కాక సగటు క్రికెట్ అభిమానిని కూడా అయోమయంలోకి నెడుతోంది. అసలు విషయమేంటంటే, భారత క్రికెట్ కు భారతరత్న సచిన్ టెండూల్కర్ తో పాటు సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ లు ఎనలేని సేవలందించారు. దీంతో ప్రస్తుతం ఖాళీగా ఉన్న టీమిండియా కోచ్ పదవికి సరైన వ్యక్తిని ఎంపిక చేసే బాధ్యతను ఈ ముగ్గురితో కొత్తగా ఏర్పాటు చేసిన సలహా కమిటీకి బీసీసీఐ అప్పగించింది. అయితే ఈ కమిటీపై రవిశాస్త్రి అంత సానుకూలంగా ఉన్నట్లు లేరు. కోచ్ పనిలో సలహా కమిటీ జోక్యం ఎందుకంటూ ఆయన తన సన్నిహితుల దగ్గర వ్యాఖ్యానించడం ఈ తరహా వాదనకు బలం చేకూరుస్తోంది. బంగ్లా పర్యటన ముగిసిన వెంటనే రవిశాస్త్రి బీసీసీఐ పెద్దలతో భేటీ కానున్నారట. సదరు భేటీలో సలహా కమిటీ జోక్యంపై ఆయన ప్రశ్నలు సంధించే అవకాశాలున్నాయని క్రీడా వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.