: పారిస్ వెళ్లి విమానాలు చూసి రానున్న కంభంపాటి
పారిస్ లో ఏవియేషన్ షో-2015 అట్టహాసంగా ప్రారంభమైన నేపథ్యంలో అక్కడ పర్యటించి కొత్త తరం సాంకేతికతను పరిశీలించి రావాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. అందులో భాగంగా ఢిల్లీలో రాష్ట్ర అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహన రావు, ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రాలతో కూడిన బృందం ఫ్రాన్స్ బయలుదేరి వెళ్లనుంది. ఏపీకి పెట్టుబడులను ఆహ్వానించే దిశగా అక్కడో ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు గల అవకాశాలను వివరించి, పెట్టుబడులతో వచ్చే కంపెనీలకు చూపించే సదుపాయాలు, సత్వర అనుమతులను గురించి సమగ్రంగా తెలియజేస్తారని ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. కాగా, ప్రదర్శనకు ప్రపంచం నలుమూలల నుంచి పారిశ్రామికవేత్తలు హాజరు కానున్న సంగతి తెలిసిందే. ఎయిర్ బస్, బోయింగ్, బొంబార్డియర్ తదితర కంపెనీలకు చెందిన 2 వేలకు పైగా స్టాల్స్ నూతన ఉత్పత్తులను, కొత్త తరం సాంకేతికతను ప్రదర్శన వేదికగా ప్రపంచానికి పరిచయం చేయనున్నాయి.