: సుష్మ వ్యవహారంపై మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారు?: దిగ్విజయ్ సింగ్
ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీకి వీసా విషయంలో కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ సాయం చేయడంపై ప్రతిపక్షాల నుంచి ప్రశ్నలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇంతవరకు స్పందించకుండా మౌనం వహించడంపై ఆరోపణలు తలెత్తుతున్నాయి. "విదేశాంగ శాఖ మంత్రిపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎప్పుడూ బాధ్యత, అవినీతి గురించి మాట్లాడే మోదీ ఇప్పుడు మాత్రం మౌనంగా ఉన్నారు" అని సీపీఐ (ఎం) జనరల్ సెక్రెటరీ సీతారాం ఏచూరి అన్నారు. ఈ అంశంపై ఎలా స్పందిస్తారు?, పార్లమెంటుకు ఏ విధంగా జవాబుదారీతనంగా ఉంటారని ప్రధానిని అడుగుతున్నామన్నారు. ఈ విషయంపై మోదీ మౌనం వహించడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తప్పుబట్టారు. లలిత్ మోదీకి సహాయం చేయడంపై ప్రధాని ఆలోచనలను బయటకు చెప్పాలన్నారు. మోదీజీ ఎందుకు 'మౌన్ మోదీ'గా ఉన్నారని డిగ్గీ ప్రశ్నించారు.