: రక్తమోడిన ఇరాక్... బాగ్దాద్ లో కారు బాంబు పేలుడు
ఇరాక్ రాజధాని బాగ్దాద్ మరోసారి రక్తమోడింది. గత రాత్రి కారు బాంబు పేలిన ఘటనలో 10 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాగ్దాద్ లోని కహిరా మార్కెట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. కారులో వచ్చిన ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో ఈ ఘోరం జరిగింది. అయితే, ఈ దాడికి పాల్పడింది తామేనని ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. ప్రస్తుతం బాగ్దాద్ లో ఐఎస్ఐఎస్ మిలిటెంట్లే ఎక్కువగా దాడులకు పాల్పడుతున్నారు. దీంతో, ఈ ఘటనకు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులే కారణం అయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఉన్న కార్లు, షాపులు ధ్వంసమయ్యాయి.