: డ్రా అయిన మ్యాచ్ లో కూడా బాగా ఆడారట... క్రికెటర్లకు డిన్నర్ పార్టీ
బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ వరుణుడి కారణంగా డ్రా అయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ తరువాత భారత టెస్టు ర్యాంకింగ్ సైతం దిగజారింది. అయినప్పటికీ, మ్యాచ్ లో బాగా ఆడారంటూ టీం డైరెక్టర్ రవిశాస్త్రి క్రికెటర్లకు డిన్నర్ పార్టీ ఇచ్చారు. ఢాకాలో అత్యంత విలాసవంతమైన ప్రాంతంగా గుర్తింపున్న గుల్షాన్ ప్రాంతంలోని క్లబ్ లో ఈ పార్టీ జరిగింది. మ్యాచ్ డ్రా అయినప్పటికీ, నైతిక విజయం భారత్ దేనని ఈ సందర్భంగా రవిశాస్త్రి వ్యాఖ్యానించారు. టెస్టు మ్యాచ్ తరవాత హర్భజన్ సింగ్, కీపర్ వృద్ధిమాన్ సాహాలు ఇండియాకు తిరిగి వెడుతున్న సందర్భంగా, వారికి వీడ్కోలు పలికేందుకు ఈ పార్టీని ఇచ్చినట్టు టీం మేనేజ్మెంట్ వర్గాలు తెలిపాయి. ఇదిలావుండగా, తదుపరి మ్యాచ్ లకు కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించేందుకు ఈ సాయంత్రం మహేంద్ర సింగ్ ధోనీ జట్టుతో కలవనున్నాడు.