: భార్య, కుమారులపై కత్తితో దాడి చేసిన కసాయి... ఆ తర్వాత ఆత్మహత్య
కట్టుకున్న భార్య, కడుపున పుట్టిన ఇద్దరు కొడుకులపై ఆ కసాయి కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. భార్యతో పాటు చిన్న కొడుకునూ పొట్టనబెట్టుకున్నాడు. పెద్ద కుమారుడిని ఆస్పత్రిపాల్జేశాడు. ఆ తర్వాత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గొర్తెసీతారామపురంలో నేటి తెల్లవారుజామున ఈ దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో గ్రామానికి చెందిన వెంకటరమణ అనే వ్యక్తి భార్య గంగ, కుమారులు ప్రవీణ్, నవీన్ లపై కత్తితో దాడికి దిగాడు. ఈ దాడిలో గంగ, నవీన్ అక్కడికక్కడే చనిపోగా, ప్రవీణ్ తీవ్ర గాయాలపాలయ్యాడు. దాంతో అతనిని గ్రామస్థులు విశాఖ కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. భార్య, కొడుకులపై దాడి చేసిన వెంకటరమణ ఆ తర్వాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.