: కొత్త కారులో తొలి ప్రయాణంలోనే ఈటెలకు ప్రమాదం... కొత్త డ్రైవరూ కారణమేనట!
తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కారు ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూస్తున్నాయి. నిన్న ప్రమాదం జరిగిన సమయంలో ఆయన కారును రెగ్యులర్ డ్రైవర్ నడపలేదట. అనివార్య కారణాల వల్ల కొత్త డ్రైవర్ కారును నడపగా, ఈటెల తన సొంత నియోజకవర్గం హుజూరాబాదు వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. ఇక ప్రమాదానికి గురైన కారు కొత్తదట. బుల్లెట్ ప్రూఫ్ భద్రతతో బయటకు వచ్చిన సదరు కొత్త కారులో ఈటెల తన తొలి ప్రయాణంలోనే ప్రమాదానికి గురయ్యారు. ఇక ఈ కారు బుల్లెట్ ప్రూఫ్ కాకపోయి ఉంటే మాత్రం పరిస్థితి ఎలా ఉండేదో ఊహించడానికే సాధ్యం కాదంటున్నారు ఘటనా స్థలిని చూసిన వారు. సాధారణంగా ఇన్నోవా కారును వాడుతున్న ఈటెల నిన్ననే బుల్లెట్ ప్రూఫ్ గా తీర్చిదిద్దిన ఫార్చూనర్ ను వాడారట. ఆ కారే ఆయనను ఆస్పత్రిపాల్జేసింది.