: ఆయనతో సినిమా చేయలేనని అనుకున్నా: ప్రభాస్
బాహుబలి ఆడియో వేడుకలో హీరో ప్రభాస్ మాట్లాడారు. దర్శకుడు రాజమౌళి గురించి చెబుతూ... తొలుత ఆయనో కథ వినిపించాడని తెలిపాడు. అయితే, అప్పట్లో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా నచ్చకపోవడంతో ఆ ప్రాజెక్టు ఓకే కాలేదని వివరించాడు. ఆ తర్వాత సింహాద్రి సినిమా ప్రివ్యూ చూద్దామని తారక్ పిలిచాడని, వెళ్లి చూసిన తర్వాత పిచ్చెక్కిపోయిందని తెలిపాడు. ఇలాంటి దర్శకుడినా నేను వద్దనుకుంది! అని భావించానని, ఇంటికెళ్లి ఆలోచిస్తే, ఇక ఎస్ఎస్ రాజమౌళి అనే వ్యక్తితో తానెప్పుడూ సినిమాలు చేయలేనేమోనని అనుకున్నానని వివరించాడు. ఇక, 'వర్షం' సినిమాకు ముందే రాజమౌళి కలిసి ఇద్దరం సినిమా చేద్దామని చెప్పాడని, వర్షం హిట్టయినా, ఫ్లాపయినా నో ప్రాబ్లం... చేద్దామన్నాడని, దాంతో, మనుషులు ఇలా కూడా ఉంటారా? అనిపించిందన్నాడు. ఓసారి రిజెక్ట్ చేసినా సినిమా చేద్దామంటున్నాడు ఏమిటీ మనిషి? అని అనుకున్నానని వివరించాడు. అలా చేసిందే 'ఛత్రపతి' అని ప్రభాస్ తెలిపాడు. ఆ తర్వాత నుంచి రాజమౌళి క్లోజ్ ఫ్రెండ్ అయ్యాడని చెప్పాడు.