: చంద్రబాబును విమర్శించే అర్హత కేసీఆర్ కు లేదు: జేసీ ప్రభాకర్ రెడ్డి
ఓటుకు నోటు కేసుపై అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై విమర్శలు చేసే అర్హత తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు లేదని జేసీ బ్రదర్ తేల్చిచెప్పారు. కొద్దిసేపటి క్రితం అనంతపురంలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా జేసీ ఈ మేరకు వ్యాఖ్యానించారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో మాట్లాడిన సందర్భంగా డబ్బులిస్తానని చంద్రబాబు ఎక్కడా చెప్పలేదని ఆయన గుర్తు చేశారు. ధైర్యం చెప్పడమే కాక భరోసా ఇవ్వడం చంద్రబాబుకు అలవాటని చెప్పిన ఆయన, ఆ మేరకే తమ పార్టీ అధినేత మాట్లడారని చెప్పారు. అయినా తమ పార్టీ టికెట్లపై గెలిచిన పలువురు ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి తన పంచన చేర్చుకున్న కేసీఆర్ కు చంద్రబాబును విమర్శించే అర్హత ఎక్కడిదని జేసీ బ్రదర్ నిలదీశారు.