: చంద్రబాబు ‘స్ట్రీట్’ నుంచే సిగ్నళ్లు... టవర్ లొకేషన్ పట్టేసిన ఏసీబీ!
ఓటుకు నోటు కేసులో ఆధారాల సేకరణ దిశగా సాగుతున్న తెలంగాణ ఏసీబీ కీలక సాక్ష్యాలను పట్టేసింది. కేసులో కీలక నిందితుడు, టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి ‘బాస్’తో జరిపిన ఫోన్ సంభాషణలు, సదరు ‘బాస్’ తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో జరిపిన ఫోన్ సంభాషణల టవర్ లొకేషన్ ఒకటేనని తేల్చింది. ఈ లొకేషన్ జూబ్లీహిల్స్ రోడ్ నెం.24లో ఉన్నట్లు ఏసీబీ అధికారులు తేల్చారు. ఈ వీధిలోని అద్దె ఇంటిలోకి ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఇటీవలే చేరిన సంగతి తెలిసిందే. తన సొంతింటిని పునర్మించుకుంటున్న చంద్రబాబు, రోడ్ నెం.24లోని ఓ ఇల్లును అద్దెకు తీసుకున్నారు. ప్రస్తుతం ఓటుకు నోటు కేసులో ఏసీబీ చేతికి చిక్కిన చంద్రబాబు ఫోన్ సంభాషణలు ఈ వీధిలోని టవర్ల నుంచే వెళ్లాయట. స్టీఫెన్ సన్ తో ఫోన్ లో సంభాషించింది చంద్రబాబేనని తెరాస నేతలు చెబుతుండగా, తాజాగా ఈ ఫోన్ సంభాషణల టవర్ లొకేషన్ కూడా అక్కడే ఉందని ఏసీబీ తేల్చడంతో సాక్ష్యాలు మరింత బలోపేతమయ్యాయి. దీంతో కేసులో దూకుడు పెంచేందుకు ఏసీబీ సన్నాహాలు చేస్తోందట.