: రుణగ్రహీతలకు మరింత ఊరట: అరుణ్ జైట్లీ
బ్యాంకుల్లో రుణాలు తీసుకుని నెలసరి కిస్తీలు చెల్లిస్తున్న ప్రజలకు మరింత ఊరట లభించనుందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. బ్యాంకర్లతో సమావేశమైన అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ మేరకు వడ్డీ రేట్లు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు ఆయన వివరించారు. ఈ సంవత్సరం జనవరి నుంచి ఆర్ బీఐ ముప్పావు శాతం మేరకు వడ్డీ రేట్లను తగ్గించినా, బ్యాంకర్లు ఆ ప్రయోజనాలను ప్రజలకు పూర్తిస్థాయిలో అందించలేదని ఆయన ప్రస్తావించారు. సత్వరం స్పందించి వడ్డీలను తగ్గించాలని సూచించారు. ఇందుకు స్పందించిన బ్యాంకర్లు మరో రెండు నెలల్లో దీన్ని ఆచరణలో పెడతామని వివరించినట్టు ఆయన తెలిపారు. కాగా, బ్యాంకర్ల సమావేశాన్ని తొలుత ప్రభుత్వరంగ బ్యాంకులకు మాత్రమే పరిమితం చేసినప్పటికీ, చివరి నిమిషంలో ప్రైవేటు రంగ దిగ్గజాలు ఐసీఐసీఐ, హెచ్ డీఎఫ్ సీ, యాక్సిస్ బ్యాంకుల చీఫ్ లను కూడా ఆహ్వానించడం గమనార్హం.