: నా అసెంబ్లీ సెగ్మంట్లు ఏడు కాదు, గల్ఫ్ తో కలిపి ఎనిమిది: ఎంపీ కవిత
తన నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లు ఏడు కాదని, గల్ఫ్ తో కలిపి ఎనిమిదని ఎంపీ కల్వకుంట్ల కవిత చమత్కరించారు. గల్ఫ్ పర్యటనలో ఉన్న ఆమె బహ్రెయిన్ లో పర్యటించిన సందర్భంగా మాట్లాడుతూ, ఎడారిలో ఉన్నా ప్రవాసీయులు నూటికి నూరుపాళ్లు తెలంగాణ బిడ్డలేనని, వారి పేర్లను రేషన్ కార్డుల్లోంచి తొలగించకుండా చూస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ పరిధిలోని ప్రతి సమస్య పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తానని ఆమె చెప్పారు. అవసరమైతే కేంద్రంపై ఒత్తిడి తెస్తానని ఆమె అన్నారు. కార్మికులతో సహపంక్తి భోజనం చేశారు. ఇక ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస రావాల్సిన అవసరం లేకుండా తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ చేపట్టిందని, అక్కడే వ్యవసాయం చేసుకుని గల్ఫ్ లో జీతం కంటే ఎక్కువ సంపాదించవచ్చని తెలిపారు. గల్ఫ్ లో ఉన్నవాళ్లు తమ పిల్లలను బాగా చదివించి, వృత్తిపరమైన కోర్సులు చేయించాలని ఆమె సూచించారు.