: నువ్వో అసమర్థుడివి... నువ్వు పూర్తి చేసిన ప్రాజెక్టులు ఏవీ? : కేసీఆర్ పై ఉమ ఫైర్
ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలంగాణ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని, ఓ సీఎంగా ఉండి ఆడా, మగా అని మాట్లాడడం సిగ్గుచేటని విమర్శించారు. "హుస్సేన్ సాగర్ ని కాదు శుద్ధి చేయాల్సింది... ముందు నీ నోటిని శుద్ధి చేసుకో" అని సలహా ఇచ్చారు. కేసీఆర్ మాట్లాడుతున్న భాష సభ్యసమాజం తలదించుకునేలా ఉందన్నారు. ప్రాజెక్టులకు అనుమతి తీసుకోవాలని తాము చెబితే, ఆయన తీవ్ర దూషణలకు దిగుతున్నారని ఉమ తెలిపారు. ముఖ్యమంత్రినన్న విషయం మర్చిపోయి మాట్లాడుతున్నారని, ఓ పార్టీ అధ్యక్షుడిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. టీడీపీపై దాడి చేయాలన్న భావనతోనే ఆయన దిగజారి ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో ప్రాజెక్టులకు తాము వ్యతిరేకం కాదని, నీటిని తీసుకుంటామంటే తాము అభ్యంతరం చెప్పబోమని అన్నారు. అయితే, ప్రాజెక్టులకు అనుమతులు తీసుకోవాలని మాత్రమే చెబుతున్నామని ఉమ వివరించారు. ప్రాజెక్టులు పూర్తిచేయడం చేతకాక తమపై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా? స్పృహ లేకుండా మాట్లాడుతున్నావా? అని కేసీఆర్ ను ప్రశ్నించారు.