: ఉద్యోగం పోయినా డబ్బు కష్టాలు రాకూడదనుకుంటే...!
చేస్తున్న ఉద్యోగం పోవాలని ఎవరూ అనుకోరు. దురదృష్టం వెన్నాడి ఉద్యోగం ఊడిపోతే, ఒక్కసారిగా ఆర్థిక కష్టాల్లోకి కూరుకుపోవాల్సిందే. అది ఎంతో మానసిక క్షోభను కలిగిస్తుంది. తేరుకోవడానికి చాలా సమయమే పడుతుంది. అయితే, ముందు జాగ్రత్తలు పాటిస్తూ, ఓ ప్రణాళిక ప్రకారం 'ఫైనాన్షియల్ ప్లాన్' అమలు చేస్తే అనుకోనిది ఏదైనా జరిగినా కూడా ఇబ్బందులను సులువుగా అధిగమించవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు. వాటిల్లో కొన్ని... రుణాల నిర్వహణ: ఇవాళా రేపు ప్రతి వేతన జీవిపైనా కారు రుణం, గృహ రుణం లేదా మరో రుణ భారం ఉంటూనే ఉంది. దీంతో పాటు ప్రతినెలా తప్పనిసరిగా చెల్లించాల్సిన కమిట్ మెంట్లూ ఉంటాయి. ఉద్యోగం పోతే ఫస్ట్ ఏర్పడే ప్రధాన సమస్య వీటి చెల్లింపులే. అయితే, ఇటువంటి ఘటన జరిగితే 'ఈఎంఐ హాలిడే' ఇవ్వాలని మీరు బ్యాంకును కోరవచ్చు. ఇదే సమయంలో చెల్లించాల్సిన నెలవారీ కిస్తీని తగ్గిస్తూ, కాల పరిమితి పెంచాలని కూడా కోరవచ్చు. చేస్తున్న ఉద్యోగం పోయిందని బ్యాంకులకు తెలిపితే ఆరు నెలల వరకూ ఈఎంఐ హాలిడే సదుపాయాన్ని బ్యాంకులు సులువుగానే అంగీకరిస్తున్నాయి. వాహన రుణం విషయంలోనూ ఇదే దారిలో నడవొచ్చు. కార్డులు మాని క్యాష్ వాడండి: తక్షణం నొప్పి తెలియకుండా తదుపరి బాదే క్రెడిట్ కార్డుల వాడకాన్ని పూర్తిగా నిలిపివేసి, చేతిలో ఉన్న డబ్బుతో మాత్రమే ఖర్చులను వెళ్లదీయాలి. అసలే ఉద్యోగం లేకుండా, చేతిలో ఉంది కదాని కార్డులు వాడడం మొదలుపెడితే, వడ్డీలు, పెనాల్టీల భారం ఊహించనంత ఎత్తునకు పెరుగుతుంది. కనీసం మరో ఉద్యోగం వచ్చేంత వరకూ క్రెడిట్ జోలికి వెళ్లరాదు. సెటిల్ మెంటు డబ్బును జాగ్రత్తగా వాడాలి: ఏదైనా కంపెనీ ఓ ఉద్యోగిని తొలగిస్తున్నదంటే, సెటిల్ మెంటు రూపంలో కొంత మొత్తం చేతికందుతుంది. సర్వీసు కాలాన్ని బట్టి అది ఎక్కువ లేదా తక్కువ మొత్తంగా ఉండవచ్చు. మరో జాబ్ దొరికే వరకూ ఈ మొత్తాన్ని కిరాణా, అద్దె, పాలు తదితర నెలసరి ఖర్చుల నిమిత్తం మాత్రమే అట్టి పెట్టుకుంటే మంచిది. ప్రీమియంల చెల్లింపుపై..: ఏవైనా బీమా పాలసీలు తదితర చెల్లింపులు జరుపుతూ ఉండినట్లయితే, వాటిని కొనసాగించాలా? లేక రద్దు చేసి డబ్బు వెనక్కు తీసుకోవాలా? అన్నది, అప్పటి అవసరాల గురించి యోచించి నిర్ణయం తీసుకోవాలి. డబ్బు అత్యవసరమని భావిస్తే, ఈ తరహా పాలసీల నుంచి విరమించుకోవడం ద్వారా కొంత మొత్తం చేతికందుతుంది. బీమా సదుపాయమూ ఉంది: భవిష్యత్తులో ఉద్యోగం పోతుందేమో అన్న ఆలోచన ఉన్నా లేకపోయినా, ఉద్యోగంపై బీమా చేయించుకుని ఉంటే ఎంతో మంచిది. తక్కువ ప్రీమియంతోనే చాలా కంపెనీలు బీమా సేవలు అందిస్తున్నాయి. ఒకవేళ ఉద్యోగం పోతే, కనీసం 6 నెలల పాటు నెలసరి వేతనంలో సగం మొత్తాన్ని ఈ కంపెనీలు అందిస్తాయి. అయితే, కనీసం ఒక సంవత్సరం ముందు నుంచే బీమా అమల్లో ఉండాలన్నది కంపెనీల నిబంధన.