: కేసీఆర్ పుణ్యాత్ముడేమీ కాదు... ఆయన ‘చిట్టా’ కూడా ఉందంటున్న కేంద్ర మంత్రులు!
ఓటుకు నోటు వ్యవహారంలో టీడీపీ, బీజేపీల మధ్య పొత్తు కీలక పాత్ర పోషించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ వ్యవహారంలో తమ మిత్రపక్షం టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుకు మద్దతుగా నిలబడాల్సిందేనని కొందరు కేంద్ర మంత్రులు గట్టిగా వాదిస్తున్నారట. ఏపీలో తమకు లభించిన ఎంపీ సీటు కూడా టీడీపీ కారణంగానే వచ్చిందని, తమ పార్టీ నేతకు ఓ ఎమ్మెల్సీ సీటును కూడా చంద్రబాబు ఇచ్చారని కూడా సదరు మంత్రులు చెబుతున్నారు. సీట్ల పంపకమెలా ఉన్నా, కేసీఆర్ పుణ్యాత్ముడేమీ కాదంటున్నారు ఆ మంత్రులు. పలు పార్టీల నేతలకు వల వేసి తన పార్టీలో చేర్చుకున్న కేసీఆర్... ఎక్కడ ఏమి చేశారో, ఏ తరహా ప్రలోభాలకు దిగారో కూడా తమకు తెలుసని సదరు కేంద్ర మంత్రులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన ‘చిట్టా’ తమ వద్ద ఉందని కూడా వారు తమ ప్రైవేట్ సంభాషణల్లో వ్యాఖ్యానిస్తున్నారు. టెలీ కమ్యూనికేషన్ల శాఖ, ఐబీ వంటి దర్యాప్తు సంస్థలను రంగంలోకి దించితే, కేసీఆర్ ప్రలోభాలకు సంబంధించి ఆధారాలను సేకరించడం అంత పెద్ద కష్టమేమీ కాదని కూడా వారు వాదిస్తున్నారు. ఈ క్రమంలో ఓటుకు నోటు వ్యవహారం అతి త్వరలోనే కీలక మలుపు తిరిగే అవకాశాలు లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది.