: రెండో ప్రపంచ యుద్ధంలో తగిలిన బుల్లెట్...కడుపులో అలాగే ఉండిపోయింది
1945లో ముగిసిన రెండో ప్రపంచ యుద్ధంలో తగిలిన బుల్లెట్ ఓ 94 ఏళ్ల వ్యక్తి కడుపులో ఉండిపోయింది. అయితే బుల్లెట్ తగిలినట్టు ఆయనకు తెలియకపోవడం విశేషం. చైనాలోని షిచువా ప్రాంతానికి చెందిన డువాన్ జికాయ్ (94) అనే వ్యక్తికి గత రెండేళ్లుగా కడుపునొప్పి వస్తోంది. పాతతరానికి చెందిన వ్యక్తి కావడం, చైనా ఆర్మీలో పనిచేయడంతో తనకున్న పరిజ్ఞానం మేరకు కడుపునొప్పి విరుగుడు మందులు వాడుతూ నొప్పి తగ్గించుకుంటున్నాడు. గత కొంత కాలంగా కడుపునొప్పి తీవ్రత పెరగడంతో జికాయ్ వైద్యులను సంప్రదించాడు. దీంతో స్కానింగ్ చేసిన వైద్యులు షాక్ కు గురయ్యారు. అతని కడుపులో 1.1 అంగుళాల బుల్లెట్ కనిపించింది. అదెలా వచ్చిందని ఆరా తీయగా, ఆయన 1943లో రెండో ప్రపంచ యుద్ధంలో చైనా తరుపున పోరాడాడని, అప్పుడు తగిలి ఉండవచ్చని చెప్పారు. అయితే ఆపరేషన్ చేసి బుల్లెట్ తీసేందుకు ఆయన వయసు సహకరించదని, కడుపునొప్పి నివారణకు మందులిచ్చి పంపేశారు. మొత్తానికి 60 ఏళ్లుగా ఆ బుల్లెట్ ఆయన కడుపులో సహవాసం చేస్తుండడం విశేషం.