: సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగిన భట్టి విక్రమార్క
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన ఓటుకు నోటు వ్యవహారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క నిప్పులు చెరిగారు. ఎమ్మెల్యేను ప్రలోభపెట్టి డబ్బు ఇవ్వజూపిన విషయంలో రేవంత్ రెడ్డిది తప్పైతే, గెలిచే సామర్థ్యం లేకపోయినా ఐదో అభ్యర్థిని పోటీకి దింపిన కేసీఆర్ దీ తప్పేనన్నారు. ప్రలోభాలతో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకోలేదని చెప్పగలరా? అని సూటిగా ప్రశ్నించారు. డీఎస్పీని మధ్యవర్తిగా పెట్టి ఎమ్మెల్యేకు రూ.3 కోట్లు ఆఫర్ చేయడం తప్పు కాదా? అని నిలదీశారు. ఎమ్మెల్యేలను బెదిరించి, ప్రలోభపెట్టడం రాజ్యాంగ విరుద్ధమని, రేవంత్ కు ఒక చట్టం, కేసీఆర్, కేటీఆర్ కు మరో చట్టం ఉండదని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులను ఈసీ దృష్టికి తీసుకెళతామని చెప్పారు. కాగా మీడియా స్వేచ్ఛపై మాట్లాడే హక్కు, అర్హత కేసీఆర్ కు లేవని భట్టి అన్నారు. మీడియాను 10 కి.మీ లోతున పాతిపెడతానన్న కేసీఆర్... మీడియా స్వేచ్ఛ గురించి మాట్లాడడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. సొంత మీడియాలో చూపిస్తే స్వేచ్ఛ, మిగిలిన మీడియాలో చూపితే సంకెళ్లా? అని అడిగారు.