: రేపు శుభవార్త చెప్పనున్న ముఖేష్ అంబానీ
అత్యంత వేగంగా డేటా సేవలను దగ్గర చేసే 4-జి సాంకేతికతతో కూడిన సేవలు దేశవ్యాప్తంగా ఎప్పటి నుంచి ప్రారంభిస్తామన్న విషయాన్ని రేపు జరిగే వార్షిక సర్వసభ్య సమావేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ స్వయంగా తెలియజేస్తారని సమాచారం. ఇప్పటికే రిలయన్స్ జియో ఇన్ఫోకాం పేరిట రూ. 29,700 కోట్ల పెట్టుబడులతో దేశవ్యాప్తంగా టవర్లను సిద్ధం చేసుకున్న సంస్థ సేవలందించేందుకు సిద్ధంగా ఉంది. కమ్యూనికేషన్, డిజిటల్ సేవల్లో విప్లవాత్మక మార్పుగా నిపుణులు అభివర్ణిస్తున్న నాలుగో తరం వాయు తరంగాల దేశవ్యాప్త లైసెన్స్ ఒక్క రిలయన్స్ జియో కాం పేరిట మాత్రమే ఉన్న సంగతి తెలిసిందే. రిలయన్స్ కార్యాలయాలు సహా పలు చోట్ల పైలట్ ప్రాజెక్టుగా 4జీ సేవలను అందిస్తే, దీన్ని వాడిన వారి నుంచి మంచి స్పందన వచ్చిందని సంస్థ అధికారులు తెలిపారు. పలు టెలికం కంపెనీలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలు చేసుకోవడం ద్వారా అందరికీ ఈ సేవలను దగ్గర చేస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక నివేదికలో ముఖేష్ ఇప్పటికే తెలిపారు. 800, 1,800, 2,300 మెగాహెర్జ్ ఫ్రీక్వెన్సీపై ఎల్టీఈ సాంకేతికత ఆధారంగా 4జీ సేవలను ఆర్ జియో అందించనుంది. దేశవ్యాప్తంగా 22 టెలికం సర్కిళ్లుండగా, 20 సర్కిళ్లలో ఒకేసారి ఈ సేవలను అందుబాటులోకి తేవాలన్నది సంస్థ అభిమతం. ఎప్పటి నుంచి ఈ సేవలు మొదలవుతాయన్న విషయమై నేడు మరింత స్పష్టత రానుంది. ఇది స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు, టెక్ ప్రియులకు శుభవార్తే!