: చంద్రబాబు దంపతుల పక్కన కూర్చున్న రేవంత్... మాటలు మాత్రం లేవు!


టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి ఎక్కడ ఉంటే అక్కడ మాటల సందడే. అయితే తన సొంత కూతురు నైమిశ నిశ్చితార్థంలో మాత్రం ఆయన తన నోటికి తాళం వేసుకోవాల్సి వచ్చింది. ఓటుకు నోటు కేసులో అరెస్టైన ఆయనకు కూతురు నిశ్చితార్థం ఉన్నందున ఏసీబీ కోర్టు 12 గంటల మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. బెయిలైతే ఇచ్చింది కానీ, బయట ఏ ఒక్క రాజకీయ నేతతోనూ మాట్లాడటం, ఫోన్ చేయడం లాంటి వాటికి దూరంగా ఉండాలని కఠిన షరతు విధించింది. కోర్టు ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు సివిల్ డ్రెస్సుల్లో రేవంత్ పై గట్టి నిఘా పెట్టారు. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితం నిశ్చితార్థం వేడుకకు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సతీసమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ సోఫాలో చంద్రబాబు దంపతులు కూర్చోగా, రేవంత్ రెడ్డి కూడా అక్కడికి వచ్చి చంద్రబాబు పక్కన కూర్చున్నారు. అయితే పలకరింపులు తప్ప వారిద్దరి మధ్య ఒక్క మాట కూడా పెగలలేదు. కొన్ని క్షణాల సేపు అక్కడ కూర్చున్న రేవంత్ ఫోటోగ్రాఫర్లు ఫొటోలు తీసుకున్న తర్వాత అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోయారు. ఇక కార్యక్రమానికి విచ్చేసిన తన పార్టీ నేతలతోనూ పలకరింపు, ఆలింగనాలతోనే రేవంత్ రెడ్డి సరిపెట్టాల్సి వచ్చింది.

  • Loading...

More Telugu News