: సంవత్సరానికి రూ.7 కోట్లు తీసుకుని టీమిండియాకు కోచింగ్ ఇవ్వనున్న రవిశాస్త్రి!
భారత క్రికెట్ జట్టు తదుపరి కోచ్ గా మాజీ కెప్టెన్, ప్రస్తుత టీం డైరెక్టర్ రవిశాస్త్రి నియామకం దాదాపు ఖరారైనట్టు తెలిసింది. టీమిండియాకు కోచింగ్ బాధ్యతలు నిర్వహించేందుకు ఆయనకు సంవత్సరానికి రూ. 7 కోట్ల ఆకర్షణీయమైన వేతనం ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయం నిజమైతే ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం పుచ్చుకునే క్రికెట్ కోచ్ గా రవిశాస్త్రి నిలుస్తాడు. కాగా, 53 ఏళ్ల రవిశాస్త్రి ప్రస్తుతం ఏడాదికి రూ. 4 కోట్ల వేతనంపై టీవీ కామెంటేటర్ గా, రూ. 6 కోట్లకు టీం డైరెక్టరుగా విధులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ 2015తో కోచ్ గా పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న డంకన్ ఫ్లెచర్ కు సాలీనా రూ. 4.5 కోట్ల వేతనాన్ని బీసీసీఐ ఇచ్చింది. బంగ్లాదేశ్ టూర్ ముగిసేలోగా కొత్త కోచ్ నియామకంపై అధికారిక సమాచారం వెలువడవచ్చని తెలుస్తోంది.