: ఏ టీవీలో వేశారో ఆ టీవీ వాళ్లనే చెప్పమను!: రిపోర్టర్ పై చంద్రబాబు గరం
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ మీడియా ప్రతినిధిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడియో టేపుల వ్యవహారంపై స్పందన కోరిన ఆ రిపోర్టరుకు చంద్రబాబు ఘాటుగా జవాబిచ్చారు. 'ఆడియో టేపులు ఏ టీవీలో వేశారో జవాబును కూడా ఆ టీవీ వాళ్లనే చెప్పమను' అని అన్నారు. టేపులు ఎవరిచ్చారో ఆ టీవీ వాళ్లనే అడగాలని సూచించారు. 'ఎక్కడి నుంచి వచ్చాయో ఓ ముఖ్యమంత్రిని అడుగుతావా?... నేనా జవాబు చెప్పేది?' అంటూ మండిపడ్డారు. కట్ అండ్ పేస్ట్ చేసి ఆడియో టేపులు సృష్టించి, తనను బదులివ్వాలని కోరితే ఎలా? అని ఆవేశం ప్రదర్శించారు. అంతకుముందు ఆయన మాట్లాడుతూ... విభజన జరిగిన జూన్ 2 నాటికి ఏడాది పూర్తయిందని తెలిపారు. ఏడాదిగా తెలంగాణ ప్రభుత్వం ఎలా ప్రవర్తిస్తోందో అందరికీ వివరించానని చెప్పారు. హైదరాబాదులో ఏపీ వాళ్ల ఇళ్లపై దాడులు, ఏపీ అధికారులతో దురుసు ప్రవర్తన వంటి విషయాలను వివరించానని తెలిపారు. ప్రధాని, హోం మంత్రి, అమిత్ షాను కలిసి తెలంగాణ సర్కారు కుట్రను విశదీకరించానన్నారు. ఈ విషయమై ఉన్నతస్థాయి విచారణ చేపట్టాలని కోరినట్టు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సెక్షన్-8ను అమలు చేయాల్సిన అవసరం ఉందని కేంద్రానికి చెప్పానని అన్నారు. స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి ఏసీబీ రికార్డు చేసినట్టు ప్రచారం చేసుకున్నారని మండిపడ్డారు. ఏసీబీ ఆపరేషన్ నిర్వహిస్తే ఆధారాలు కోర్టుకు సమర్పించాలని, మరి, మీడియాలో ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ముఖ్యమంత్రే సమాచారం లీక్ చేశారని, ఆ దృశ్యాలను టీ న్యూస్ ప్రసారం చేసిందని చెప్పారు. ఏదో ఘనకార్యం చేసినట్టు న్యూస్ బ్రేక్ చేసిందని, దాన్ని అందరూ ప్రసారం చేశారని అన్నారు. తెలంగాణ హోం మంత్రి నాయిని తమ వద్ద టేపులున్నాయని, అందరిపైనా యాక్షన్ తీసుకుంటామని చెప్పారని గుర్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్ పెద్ద నేరమని, ఇష్టానుసారం కుట్రలకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. హైదరాబాద్, తెలంగాణ మిగతా జిల్లాల్లోనూ టీడీపీ బలంగా ఉందని చెప్పారు. బీజేపీతో కలిసి హైదరాబాదులో అధిక సీట్లు గెలుచుకున్నామని అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ ను టీఆర్ఎస్ క్యాబినెట్లో మంత్రిగా తీసుకోవడం ఎక్కడి నీతి? అన్నారు. పార్టీకి రాజీనామా చేయని వ్యక్తిని టీఆర్ఎస్ లోకి తీసుకుని మంత్రి పదవి ఇవ్వడం ఎక్కడి నైతికత? అని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపుల చట్టం టీఆర్ఎస్ కు వర్తించదా? అని అడిగారు.