: మాజీ క్రికెటర్ మృతికి జగ్మోహన్ దాల్మియా సంతాపం
అలనాటి క్రికెటర్ హేమంత్ కనిత్కర్ (72) కన్నుమూశారు. చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కనిత్కర్ పుణేలోని తన నివాసంలో మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కాగా, కనిత్కర్ మరణంపై బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా స్పందించారు. మాజీ క్రికెటర్ మృతికి తన సంతాపం తెలియజేశారు. కనిత్కర్ సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ మరాఠా క్రికెటర్ తన కెరీర్లో రెండు టెస్టులు ఆడారు. దేశవాళీ క్రికెట్లో మంచి బ్యాట్స్ మన్ గా గుర్తింపు పొందారు. దేశవాళీల్లో ఆడిన తొలి మ్యాచ్ లోనే సెంచరీ (1963-64 సీజన్లో మహారాష్ట్ర తరపున ఆడుతూ సౌరాష్ట్రపై) సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే, అంతర్జాతీయ వేదికలపై విఫలమయ్యారు. విండీస్ పై టెస్టు అరంగేట్రం చేసిన కనిత్కర్ 65 పరుగుల ఇన్నింగ్స్ తో అలరించినా, ఆపై అదే జోరును కొనసాగించలేకపోయారు. దీంతో, జాతీయ జట్టులో స్థానం దూరమైంది. అనంతరం, బీసీసీఐ జూనియర్ సెలక్షన్ కమిటీ సభ్యుడిగా సేవలు అందించారు.