: నీటి సమస్య పరిష్కారానికి 'సారు' గారి ఉచిత సలహా!
దేశంలో పలు ప్రాంతాలను నీటి సమస్య పట్టిపీడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. నీటి కోసం ప్రజలు పడే పాట్లు వర్ణనాతీతం. ఇలాంటి సందర్భాలలో నీటి సమస్యను అధిగమించడానికి మధ్యప్రదేశ్ లోని బుందేల్ ఖండ్ ప్రాంతానికి చెందిన ఎస్ డీఎండీకే పాండే అనే సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (డిప్యూటీ కలెక్టర్) ఓ కొత్తరకం సలహా ఇస్తున్నారు. భరించగల సామర్థ్యం ఉన్నవాళ్లు ఒక్కొక్కరూ ముగ్గురు మహిళలను వివాహం చేసుకోండని ఆయన సెలవిచ్చారు. వాళ్లలో ఒకరు పిల్లలను కంటే, మిగతా ఇద్దరు నీళ్లు తెస్తారని ఉచిత సలహా పారేశారు. తాను బైర్వార్ గ్రామం మీదుగా వెళుతుంటే రాత్రి 2 గంటల సమయంలో కూడా మహిళలు ఎక్కడికో వెళ్లి నీళ్లు తెచ్చుకోవడం చూశానని, ఇది చాలా పెద్ద సమస్య అని సదరు అధికారి వాపోయారు. ఏమైనా, ప్రజల కష్టాలపై సారు జాలి చూపించినా, ఆయన ఇచ్చిన సలహా విని మాత్రం అంతా అవాక్కయ్యారు. 'నీళ్ల కష్టాలు తీరుస్తారనుకుంటే, సారేమిటి, కొత్త కష్టాలు తెచ్చిపెడుతున్నారు?' అంటూ అక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈయన వ్యాఖ్యలు పెద్ద దుమారం లేపేలా కనిపిస్తున్నాయి!