: ఏసీబీ కౌంటర్ దాఖలు చేయలేదట...రేవంత్ కు బెయిల్ ఖాయమంటూ ఊహాగానాలు!
ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి బెయిల్ లభించేందుకు అవకాశాలు మెరుగువుతున్నాయి. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్ ను ఈ నెల 5న విచారించిన కోర్టు ఈ నెల 8 లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీకి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటిదాకా ఏసీబీ అధికారులు కౌంటర్ దాఖలు చేయలేదు. అయితే తమ కస్టడీలో ఉన్న రేవంత్ ను పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత కౌంటర్ దాఖలు చేయాలని నిర్ణయించామని, ఈ క్రమంలోనే కాస్త ఆలస్యమైందని చెబుతూ ఏసీబీ అధికారులు మరికాసేపట్లో కోర్టుకు కౌంటర్ సమర్పించనున్నారు. రేవంత్ తో పాటు సహ నిందితులిద్దరికీ బెయిల్ ఇవ్వరాదని కూడా ఏసీబీ కోర్టును విన్నవించనుంది. అయితే నిర్దేశిత సమయంలోగా ఏసీబీ అధికారులు కౌంటర్ దాఖలు చేయని నేపథ్యంలో రేవంత్ రెడ్డికి బెయిల్ ఇచ్చేందుకే కోర్టు మొగ్గుచూపే అవకాశాలున్నాయన్న వాదన వినిపిస్తోంది. దీంతో మరికాసేపట్లో మొదలుకానున్న విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.