: విమానం టికెట్ గా మారనున్న రైల్వే వెయిటింగ్ లిస్టు టికెట్... కొత్త స్కీం పెట్టిన ఇండియన్ రైల్వేస్
ఇది భారతీయులందరికీ శుభవార్తే. ముఖ్యంగా రైల్వేలను నమ్ముకుని ప్రయాణాలు చేసే మధ్య, ఎగువ మధ్య తరగతి ప్రజలకు. ఎందుకంటే... చదవండి! రైల్లో ప్రయాణించాలని వెయిటింగ్ లిస్టులో టికెట్ బుక్ చేసుకున్నారా? మీ టికెట్ కన్ఫర్మ్ కాలేదా? మీ కోసం భారతీయ రైల్వే శాఖ కొత్త స్కీమును ప్రకటించింది. ఇందులో భాగంగా ఐఆర్ సీటీసీలో బుక్ చేసుకున్న వెయిటింగ్ లిస్టు టికెట్లపై ఆకర్షణీయమైన ధరకు విమాన ప్రయాణ టికెట్లను అందిస్తామని తెలిపింది. తొలి దశలో 'గో ఎయిర్'తో చేసుకున్న ఒప్పందంలో భాగంగా 100 టికెట్లను విక్రయించామని రైల్వే శాఖ తెలిపింది. ఈ స్కీముకు మంచి స్పందన రావడంతో స్పైస్ జెట్ కూడా ఒప్పందం కుదుర్చుకుందని, ఇతర దేశవాళీ విమాన సంస్థలూ ముందుకు వస్తున్నాయని ఐఆర్ సీటీసీ ప్రతినిధి సందీప్ దుత్తా వివరించారు. అయితే, రైలు టికెట్లను కనీసం మూడు రోజులు ముందుగా బుక్ చేసుకోవాల్సి వుంటుందని, విమానం టికెట్ల లభ్యతను బట్టి అదే రోజు లేదా మరుసటి రోజుకు ఇస్తామని వెల్లడించారు. ఈ స్కీము కావాలని ముందే చెప్పిన వారికి ఈ-మెయిల్ ద్వారా సమాచారం పంపుతున్నామని తెలిపారు. స్లీపర్ నుంచి ఏసీ క్లాసుల వరకూ టికెట్లను బుక్ చేసుకున్న వారికే ఈ సదుపాయం వర్తిస్తుందని, సాధారణ విమాన టికెట్లతో పోలిస్తే 30 నుంచి 40 శాతం తక్కువ ధరకు విమానం టికెట్లు లభిస్తాయని సందీప్ తెలిపారు.