: ట్యాపింగ్ ఒట్టిమాటే... రాజ్ నాథ్ కు చెప్పిన గవర్నర్ నరసింహన్
ఓటుకు నోటు వ్యవహారంలో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఫోన్ ను తెలంగాణ ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందన్న విషయంలో ఎలాంటి వాస్తవం లేదని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తేల్చిచెప్పారు. ఈ మేరకు నిన్న ఉదయం తనకు ఫోన్ చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు ఆయన ఈ విషయాన్ని చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. ఓ సీఎం ఫోన్ ను మరో రాష్ట్ర ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తుంటే, మీరేం చేస్తున్నారన్న రాజ్ నాథ్ ప్రశ్నకు స్పందించిన నరసింహన్, చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ కు గురి కాలేదని వివరించారట. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ఫిర్యాదుతో ఆయన ఇంటిపై తెలంగాణ ఏసీబీ నిఘా పెట్టిందని... ఈ క్రమంలోనే చంద్రబాబు, స్టీఫెన్ సన్ ల మధ్య జరిగిన ఫోన్ సంభాషణ బయటకొచ్చిందని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాక ఇదే విషయాన్ని కేంద్రానికి సమర్పించనున్న నివేదికలో ధ్రువీకరిస్తానని కూడా ఆయన రాజ్ నాథ్ కు చెప్పినట్లు సమాచారం.