: వాళ్లను స్కూలు పిల్లల్లా చూడొద్దు: పీసీబీకి అక్రమ్ హితవు
పేస్ దిగ్గజం వసీమ్ అక్రమ్ పాకిస్థాన్ క్రికెట్ తీరుతెన్నులపై స్పందించాడు. క్రమశిక్షణ పేరిట పాక్ క్రికెటర్లను స్కూలు పిల్లల్లా చూడొద్దని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు హితవు పలికాడు. క్రమశిక్షణ కలిగి ఉండడం అవసరమేనని, అయితే, దాన్ని బలవంతంగా రుద్దడం వల్ల కొందరు ఆటగాళ్లు ఆత్మవిశ్వాసం కోల్పోతారని అభిప్రాయపడ్డాడు. కరాచీలో 'వసీమ్ అక్రమ్ ఫౌండేషన్' ఆవిష్కరణ కార్యక్రమంలో అక్రమ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇతర దేశాల క్రికెటర్లు విదేశీ పర్యటనల్లో ఎంతో స్వేఛ్చను ఆస్వాదిస్తుండగా, పాకిస్థాన్ క్రికెటర్ల కథ తద్విరుద్ధంగా ఉన్న విషయాన్ని గుర్తించానని, తనను ఈ అంశం ఎంతో నిరుత్సాహపరిచిందని అన్నాడు. క్రమశిక్షణ పేరిట కఠినంగా వ్యవహరించడం ఆటగాళ్ల దృక్పథాన్ని దెబ్బతీస్తుందని అన్నాడు. వృత్తిపరంగానూ, వ్యక్తిత్వపరంగానూ వాళ్లు ఎదగలేరని అభిప్రాయపడ్డాడు. తాను జాతీయ జట్టుకు ఆడే సమయంలో ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉండేవాడినని, అందుకు కారణం, తమనెవరూ స్కూలు పిల్లల్లా ట్రీట్ చేయలేదని తెలిపాడు.