: జులై నుంచి తెలంగాణలో చీప్ లిక్కర్... మారనున్న ఎక్సైజ్ పాలసీ!
అదనపు ఆదాయం కోసం ప్రణాళికలు రూపొందిస్తున్న తెలంగాణ సర్కారు ఎక్సైజ్ విధానాన్ని మార్చాలని భావిస్తోంది. అక్రమ మద్యం, గుడుంబాను అరికట్టాలంటే, ప్రభుత్వం తరపున చీప్ లిక్కర్ ప్రవేశపెట్టాలని, దీని ద్వారా భారీగా ఆదాయం వస్తుందని భావిస్తోంది. తెలంగాణలో రూ. 2 వేల కోట్ల ఆదాయాన్ని అబ్కారీ శాఖ నుంచి అంచనా వేస్తున్న సర్కారు, అందుకు తగ్గట్టు మద్యం విధానం ఉండాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగానే అధికారులు జులై నుంచి మారే ఎక్సైజ్ సంవత్సరానికి సంబంధించి నివేదికలను తయారు చేసి ప్రభుత్వానికి అందించారని సమాచారం. కొత్త దుకాణాల ఏర్పాటుకు అనుమతి, లైసెన్స్ ఫీజుల పెంపుపై విధివిధానాలను, చీప్ లిక్కర్ ను ప్రవేశపెట్టడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. గుడుంబా ధరలోనే చీప్ లిక్కర్ ను అమ్మడం ద్వారా ఆ ఆదాయం కూడా ప్రభుత్వ ఖజానాకే చేరుతుందని, ఇదే సమయంలో కల్తీ మద్యాన్ని నిరోధించడానికి అవకాశం ఉంటుందని అధికారులు ప్రతిపాదనల్లో స్పష్టం చేశారు. కాగా, ఈ చౌక మద్యం అమ్మకాల కోసం ప్రత్యేక షాపులను ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఫైల్ పై తెలంగాణ సీఎం సంతకం చేయగానే కొత్త ఆబ్కారీ విధాన ప్రకటన వెలువడుతుందని సమాచారం.