: ‘డబ్ స్మాష్’తో తీరిన సైనా యాక్టింగ్ కోరిక...యూట్యూబ్ లో వీడియో హల్ చల్
పెదవులు మనవి.. స్వరం మాత్రం పరాయి వాళ్లది. ఇదీ నెట్ లోకి దూసుకొచ్చేసిన కొత్త యాప్ ‘డబ్ స్మాష్’ రూపం. అచ్చంగా చెప్పాలంటే మనకిష్టమైన సీన్ లో ఇష్టమైన స్వరంతో కనిపించేయొచ్చన్నమాట. వెరసి మనలోని యాక్టింగ్ కోరికను ఇట్టే తీర్చేసుకోవచ్చు. నటన అంటే అమితంగా ఇష్టపడే నెటిజన్లను ‘డబ్ స్మాష్’ ఇట్టే ఆకట్టుకుంటోంది. వారిలోని నటించాలన్న కోరికను క్షణాల్లో తీర్చేస్తోంది. నచ్చిన సీన్ లో నటించేసి, దానిని మిత్రులకు పంపొచ్చు. యూట్యూబ్ లోనూ పెట్టేయొచ్చు. నెట్ లో ఏ కొత్త యాప్ అందుబాటులోకి వచ్చినా, ఆగమేఘాలపై దానిని ఆకళింపు చేసుకోవడమే కాక, దానిని వినియోగించడంలోనూ క్రీడాకారులు ముందువరుసలో ఉంటున్నారు. తాజాగా డబ్ స్మాష్ యాప్ తో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ తన యాక్టింగ్ పిచ్చిని తీర్చుకుంది. బాలీవుడ్ లో తనకిష్టమైన చిత్రాల్లోని సీన్లలో నటించేసి, సదరు వీడియోను యూట్యూబ్ లో పెట్టేసింది. సహ క్రీడాకారుడితో కలిసి సైనా ఈ వీడియోలో కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే దీనికి పెద్ద సంఖ్యలో క్లిక్ లు వచ్చాయట.