: ఈ మేకపోతు పాలిస్తుంది!
మేక పాలిస్తుంది కానీ, మేకపోతు పాలివ్వడమేంటని ఆశ్చర్యపోతున్నారా? పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాల జ్ఞానం గుర్తొస్తోందా? నిజమేనట, మేకపోతు పాలిస్తోందని దాని యజమాని చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్ లోని ఇటవా జిల్లాలోని అధ్యాపూర్ గ్రామంలో ఉదాల్ సింగ్ అనే వ్యక్తి ఈ మధ్యనే ఓ మేకపోతును కొనుగోలు చేశారు. ఆయన కొనుగోలు చేసిన అనంతరం దాని శరీరాకృతిలో మార్పులు రావడం గమనించినట్టు ఉదాల్ సింగ్ తెలిపారు. తరువాత ఓ రోజు ఓ మేకపిల్ల ఒకటి ఈ మేకపోతు పొదుగు నుంచి పాలుతాగుతూ కనిపించిందని, నిజమోకాదో పరీక్షించేందుకు తాము కూడా పాలు పితికామని ఆయన చెప్పారు. ఆశ్చర్యకరంగా దాని పొదుగు నుంచి పాలు వస్తున్నాయని, పాలో కాదో అనే అనుమానంతో పశువుల ఆసుపత్రి వైద్యుడికి చూపితే, హార్మోన్లలో వచ్చిన మార్పుల కారణంగా ఇలా అరుదుగా జరుగుతుందని చెప్పారని ఆయన వెల్లడించారు. దీంతో మేకపోతు సెలబ్రిటీగా మారిపోయిందని, దీనితో ఫోటో దిగేందుకు చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి ప్రజలు వస్తున్నారని, దీని తలను తాకితే అదృష్టం వరిస్తుందన్న నమ్మకంతో తలను తాకి వెళ్తున్నారని ఉదాల్ సింగ్ చెప్పారు.