: పీజేఆర్ కూతురు విజయారెడ్డి కంట కన్నీరు... స్టేజీ దిగిపొమ్మన్న ఎమ్మెల్యే చింతల
ఖైరతాబాదు మాజీ ఎమ్మెల్యే పి.జనార్దనరెడ్డి కూతురు, టీఆర్ఎస్ నేత విజయారెడ్డి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అందరూ చూస్తుండగానే వెక్కివెక్కి ఏడ్చారు. ఇందుకు పీజేఆర్ కు మంచి పట్టున్న ఖైరతాబాదే వేదిక కావడం విశేషం. పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన విజయారెడ్డిపై స్థానిక ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి చిందులు తొక్కారు. ఏ హోదాతో వేదిక ఎక్కావంటూ విజయారెడ్డిని నిలదీసిన చింతల, తక్షణమే వేదిక దిగివెళ్లిపోవాలని హూంకరించారు. దీంతో వేదికపైనే విజయారెడ్డి కళ్లల్లో నీళ్లు సుడులు తిరిగాయి. ఇదంతా తెలంగాణ హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి సమక్షంలోనే జరగడం విశేషం. చింతలను వారించి విజయారెడ్డిని సముదాయించేందుకు నాయిని విశ్వ యత్నం చేశారు. అయితే చింతల వ్యాఖ్యలో హతాశురాలైన విజయారెడ్డి, నాయిని ఆగమని చెప్పినా, విసవిసా వేదిక దిగి ఏడ్చుకుంటూనే వెళ్లిపోయారు. తమ ప్రియతమ నేత పీజేఆర్ కూతురు విజయారెడ్డి కంట కన్నీరు చూసిన అక్కడి పేదలు ఆమెను సముదాయించే యత్నం చేశారు. ఇక యువకులు పీజేఆర్ నినాదాలతో హోరెత్తించినా, నాయిని వారించడంతో మిన్నకుండిపోయారు.