: రేపు ఏపీ కేబినెట్ భేటీ... వెనువెంటనే ఢిల్లీకి చంద్రబాబు పయనం
ఏపీ కేబినెట్ భేటీ రేపు ఉదయం 11 గంటలకు జరగనుంది. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో ఓటుకు నోటు కేసుపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలున్నాయి. ఈ కేసులో చంద్రబాబుకు పాత్ర ఉందని ఆరోపిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిన్న రాత్రి ఆడియో టేపులను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ టేపులు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. వాస్తవానికి ఏపీ కేబినెట్ భేటీ ఈ నెల 16న జరగాల్సి ఉంది. అయితే చంద్రబాబు ఆడియో టేపుల నేపథ్యంలో సదరు భేటీని రేపటికి మార్చారు. ఇదిలా ఉంటే, కేబినెట్ భేటీ ముగియగానే చంద్రబాబు ఢిల్లీ పయనమవుతున్నారు. రేపు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు రెండు రోజుల పాటు అక్కడే ఉంటారు. ఓటుకు నోటుపై తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై చంద్రబాబు కేంద్రానికి ఫిర్యాదు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం.