: విచారణకు సహకరిస్తున్నా... వేధిస్తున్నారు: రేవంత్ న్యాయవాది
తెలంగాణ ఏసీబీ అధికారుల వేధింపులపై టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి న్యాయవాది మరోమారు గళం విప్పారు. ఓటుకు నోటు కేసులో అరెస్టై ప్రస్తుతం ఏసీబీ కస్టడీలో ఉన్న రేవంత్ రెడ్డి రెండు రోజుల విచారణను ఎదుర్కొన్నారు. నేటి ఉదయం విచారణకు తీసుకెళ్లే సమయంలో జ్వరం, గొంతునొప్పితో బాధపడుతున్న రేవంత్ రెడ్డిని ఏసీబీ అధికారులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాది ఏసీబీ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజులుగా రేవంత్ రెడ్డిని రాత్రి వేళ బల్లపై పడుకోబెడుతున్నారని ఆయన ఆరోపించారు. విచారణలో రేవంత్ రెడ్డి పూర్తిగా సహకరిస్తున్నా, ఏసీబీ అధికారులు మాత్రం రేవంత్ ను వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు.